ప్రతి నెలా మొదటి మంగళవారం (మే 6వ తేది) స్థానికులకు తిరుమలలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల కూడా స్థానికులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించనుంది. దీనిలో భాగంగా మే 4వ తేది ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ వేసవి కారణంగా బాగా పెరిగింది. ఈ క్రమంలోనే భక్తులకు అకామిడేషన్‌తో పాటు దర్శన భాగ్యం కల్పించడం టీటీడీ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలను అనుమతించబోమని వెల్లడించింది. ప్రోటోకాల్ దర్శనాలు మినహా వేరే ఏ ఇతర దర్శనాలను అనుమతించబోమని టీటీడీ వెల్లడించింది.