
తిరుమలలో ఆదివారం సాయంత్రం జరిగిన గరుడవాహన సేవలో దేశ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ రాష్ట్రాల సాంప్రదాయ–సాంస్కృతిక ప్రత్యేకతలను ప్రతిబింబించే వివిధ నృత్యరూపాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు గరుడవాహన సేవకు మరింత వైభవం చేకూర్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు వాహనసేవతో పాటు ఈ సాంస్కృతిక నృత్యరూపాలను ఆస్వాదించారు. ఈ ప్రదర్శనలు హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించారు. 22 రాష్ట్రాల నుండి వచ్చిన 38 బృందాలు, మొత్తం 957 మంది కళాకారులు పాల్గొని తమ తమ సాంప్రదాయ నృత్యరూపాలు ప్రదర్శించారు.
ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు సమర్పించిన శ్రీనివాస కల్యాణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రాజస్థాన్–గుమార్, కర్ణాటక–బేధర వేషం, మధ్యప్రదేశ్–బరేడి, శ్రీకాకుళం–టప్పేటగుళ్లు, విశాఖపట్నం–తిమ్సా, పంజాబ్–భాంగ్రా, జమ్మూ–కాశ్మీర్–డోగ్రీ, తమిళనాడు–కరక్కట్టం, హర్యానా–హర్యానవి, ఛత్తీస్‌గఢ్–పంటినృత్యం, గుజరాత్–టిప్పని సంపెలు, పుదుచ్చేరి, గోవా, హిమాచల్ ప్రదేశ్ జానపద నృత్యాలు గరుడవాహన సేవకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదనంగా రాసలీల, కథయట్టం, ఉరియడి, మయూర నృత్యం, నవదుర్గ, యక్షగానం వంటి కళారూపాలు భక్తులను మైమరిపించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళతో పాటు ఈసారి మొదటిసారిగా గోవా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ–కాశ్మీర్, పంజాబ్, హర్యానా, బీహార్, మణిపూర్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి భక్తులకు కళాత్మక మధురానుభూతిని కలిగించారు.
అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తోంది. ఇవాళ (సోమవారం) మూలా నక్షత్రం రోజు కావడంతో సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తోంది. సరస్వతీ దేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచి దుర్గమ్మను సరస్వతీదేవిలా అలంకరించి భక్తులకు ఆలయ అధికారులు దర్శన భాగ్యం కల్పించారు. దీంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి.
అమ్మవారి దర్శనానికి రెండు గంటలకు పైనే సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే భక్తలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఇవాళ సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ఏపీ ప్రభుత్వం తరుఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు కుటుంబమంతా అమ్మవారి దర్శనానికి రానున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం నాలుగు గంటలకు చంద్రబాబు కుటుంబంతో సహా ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
