శ్రీ కపిలతీర్థం ఆలయంలో భద్రతా దళాల మాక్ డ్రిల్

కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా తిరుపతిలోని శ్రీ కపిలతీర్థం ఆలయంలోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే అంశంపై ఆక్టోపస్, పోలీసు, టిటిడి విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ముందుగా కపిలతీర్థం సమీపంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయం ప్రాంగణం నుండి ఆక్టోపస్ బలగాలు మూడు గ్రూపులుగా వ్యూహాత్మకంగా సమన్వయంతో ఆలయంలోకి ప్రవేశించి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను శుక్రవారం సాయంత్రం మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు.

ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా, సివిల్ పోలీసులకు, బాంబ్ స్క్వాడ్, రిజర్వ్ సిబ్బందికి, వైద్య, ఫైర్ సిబ్బందికి, రెవిన్యూ , ట్రాఫిక్ సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. దాదాపు రెండు గంటలపాటు ఈ మాక్ డ్రిల్ కొన‌సాగింది. ఈ మాక్ డ్రిల్ 40 మంది ఆక్టోప‌స్ కమాండోలు, 10 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 13 ఏఆర్ సిబ్బంది, 12 మంది మెడికల్ సిబ్బంది, ఫైర్ , ఆర్మ్డ్ , బాంబ్ స్క్వాడ్, ఎలక్ట్రికల్ , వాటర్, గ్యాస్ శాఖల సిబ్బంది మాక్ డ్రిల్ లో భాగ‌మ‌య్యారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ శ్రీ సి. రాజారెడ్డి, డిఎస్పీ శ్రీ మధుసుధన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

Share this post with your friends