ఆదివాసీల కుంభమేళా కెస్లాపూర్ నాగోబా జాతర శనివారంనాడు అధికారికంగా ముగిసింది. ఐదు రోజులపాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. నాగోబా దేవతకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నాగోబా దేవతకు మండగాజిలి పూజలతో మెస్రం వంశీయులు జాతరను ముగించారు. నాగశేషుడికి మొక్కి వెళ్లొస్తామని చెప్పి ఆయన ఆశీస్సులతో మెస్రం వంశీయులు బుడుందేవ్ పూజలకు వెళ్లారు. మెస్రం వంశీయుల పూజ అయితే ముగిసింది కానీ జాతర మాత్రం భక్తుల కోసం మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది.
మెస్రం వంశీయులు జరిపే ఈ పండుగను అతి పెద్ద గిరిజన జాతరగా పేర్కొంటారు. ఈ జాతర ఆదివాసీల ఐక్యతకు చిహ్నం. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలేంటో తెలియాలంటే ఈ జాతరకు వెళితే చాలు. ఈ జాతరలో ఆదివాసీ, గోండ్, కోలామ్, పరదాస్, మెస్రం వంశీయులంతా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి కెస్లాపూర్ చేరుకున్నారు. ఈ జాతర నేపథ్యంలో మెస్రం వంశీయులు 41 రోజుల పాటు ఉపవాస దీక్షను చేస్తారు. జాతర తొలి రోజున ఈ దీక్షను విరమించి వీరంతా రెండవ రోజు జాతరలో భాగంగా బాన్ దేవుడికి , పెర్సపేన్ దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. మూడవరోజు ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. నాలుగో రోజు గిరిజన దర్బార్ నిర్వహించారు. చివరి రోజైన ఐదవ రోజు జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.