
జోగులాంబ ఆలయం దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయంలో ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ శర్మ వ్యవహారశైలి తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వైపు ఆలయంలో అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అది చాలదన్నట్టు ఆయన బయట విషయాల్లోనూ జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. పూజల వరకే పరిమితం కావాల్సిన ఆయన తన పరిధిని ఆలయంలో ఏది జరగాలన్నా తన అనుమతితోనే జరగాలన్న దాకా వ్యవహారం వెళ్లింది. ఆలయానికి వచ్చే వీఐపీ భక్తులను సైతం తన మాటలతో బుట్టలో వేసుకుని వారికి పెద్ద ఎత్తున సేవలందిస్తూ దగ్గరైపయాడు. ఇక అక్కడి నుంచి ఆయ వ్యవహార శైలిలో మరిన్ని మార్పులొచ్చాయట. ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆలయంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆలయ సిబ్బంది ఆరోపిస్తోంది.
ఆనంద శర్మ చేసిన ఒక పనితో ఆయన వ్యవహారాల గుట్టంతా బయటకు వచ్చింది. కర్నూల్లో తన భార్యాపిల్లలతో కలిసి సినిమాకు వెళ్లిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుని ఆనంద్ శర్మ చాటుగా ఫోటోలు, వీడియోలు తీశాడు. ఈ విషయం గమనించిన ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారమంతా అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ప్రసిద్ధ ఆలయ ప్రధాన అర్చకుడు ముఖానికి మాస్క్ వేసుకొని చాటుగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఫోటోలు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అంతుబట్టలేదు. దీనిపై ఎమ్మెల్యే కర్నూలు పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదంతా కుట్రలో భాగంగా జరుగుతున్నదని భావించి దేవదాయ శాఖ అధికారులకు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు, అసెంబ్లీ స్పీకర్ కు సైతం ఫిర్యాదు చేశాడు. దీనికి తోడు జిల్లా కలెక్టర్‌కు ఆనందశర్మపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విచారణను వేగవంతం చేశారు. ఆనంద శర్మ వ్యవహారశైలితో జోగులాంబ ఆలయ ప్రతిష్ట మసకబారుతోందని అర్చకులు ఆందోళన చెందుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోకుంటే ఆందోళనకు సైతం వెనుకాడమని చెబుతున్నారు.
