గంగమ్మ జాతర ఎలా ప్రారంభమైందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగినది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్క- సారక్క జాతర్ల మాదిరిగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారం చాటింపు వేయడం జరుగుతుంది. ఈ లెక్కన ఈ ఏడాది మే 6వ తేదీన చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు కట్టారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకుని వచ్చారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు. మర్నాటి నుంచి జాతర ప్రారంభమైంది.

Share this post with your friends