మెదక్ జిల్లా ఏడుపాయలలో వరద ఉధృతి తగ్గింది. దాదాపు పది రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో గుడిని పెద్ద ఎత్తున వరద చుట్టుముట్టింది. దీంతో ఆలయ అర్చకులు గుడిని తాత్కాలికంగా మూసి వేశారు. ఇవాళ వరద తగ్గిపోవడంతో తెల్లవారు జామున ఆలయ అర్చకులు సంప్రోక్షణ చేశారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక నేటి నుంచి భక్తులకు యథావిధిగా ఏడుపాయల వన దుర్గ మాత దర్శనం ప్రారంభం కానుంది.
పది రోజులుగా మంజీరా పరవళ్లతో వనదుర్గమ్మ ఆలయం ముందున్న నదీపాయ అమ్మవారి పాదాలను తాకుతూ మండపం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలోనే వనదుర్గ ఆనకట్ట నుంచి 34 వేల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోందని, మంజీరా నదీ పరీవాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆలయం వైపునకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసిన అర్చకులు.. భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహన్ని ఏర్పాటు చేశారు.