తిరుపతి శ్రీ కామాక్షి అమ్మవారికి వెండి ఆభరణాల విరాళం

తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలోని శ్రీకామాక్షి అమ్మవారికి పెద్ద మొత్తంలో వెండి విరాళంగా లభించింది. అమ్మవారికి స్థానిక దంపతులు ఈ విరాళాన్ని అందజేసి తమ మొక్కును చెల్లించుకున్నారు. కామాక్షి అమ్మవారికి 9 కేజీల 115 గ్రాముల వెండి ఆభరణాలను తిరుమల వాస్తవ్యులు ఎస్వీ నరహరి దంపతులు బుధవారం విరాళంగా అందించారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని నరహరి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం ఈ విరాళాన్ని అమ్మవారికి సమర్పించారు.

సుమారు రూ.9.28 లక్షలు విలువ చేసే 12 రకాల ఆభరణాలను కపిలతీర్థం ఆలయంలోని ఊంజల్ మండపం వద్ద టీటీడీ తిరుపతి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంకు దాత అందజేశారు. దాత అందించిన వెండి ఆభరణాలలో అమ్మవారికి కిరీటం – 1, చెవులు – 2, చేతులు – 4, పాదాలు – 2, పీఠం – 2, అమ్మవారికి చీర – 1 ఉన్నాయి. అనంతరం ఆభరణాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దాత శ్రీ ఎస్వీ నరహరి దంపతులను తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందించారు.

Share this post with your friends