తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 14వ తేదీన జరగనున్న పుష్పయాగానికి ఇవాళ అంకురార్పణ జరగనుంది. నేటి సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జూన్ 14న ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకూ పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.
తిరుపతిలోని ప్రముఖ ఆలయాల్లో గోవిందరాజ స్వామి ఆలయం ఒకటి. ఇది తిరుపతి రైల్వే స్టేషను సమీపంలో ఉన్న కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన్ని శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిర్వహణలోనే ఉంది. ఆలయానికి రెండు గోపురాలున్నాయి. బయటి ఆలయ గోపురం బాగా పెద్దది కాగా.. లోపలి వైపు గోపురం చాలా పురాతనమైనది. ఈ గోపురం రామాయణ, భాగవతల గాథల శిల్పాలతో చాలా అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహం శేషశాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది.