
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు సందడి నెలకొంది. అమ్మవారిని దర్శిస్తే కోరికలన్నీ నెరవేరుతాయి. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆషాడం వచ్చిందంటే చాలు భాగ్యనగరం బోనాలు శోభతో పులకించిపోతుంది. వీధి వాడా ఎటు చూసినా సందడే! ఎటు విన్నా అమ్మవారి నామ స్మరణమే! జులై 13 ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయ విశేషాలను ముందుగా తెలుసుకుందాం. ఆషాడంలో తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర బోనాలు పండుగ.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఈ సందర్భంగా ఈ వారం బోనాల జాతర జరగనున్న సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో జాతర విశేషాలు తెలుసుకుందాం. ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు పుట్టింటికి వెళ్లడం మన సంప్రదాయం కదా! అలాగే నిత్య పెళ్లి కూతురు అయిన అమ్మవారు ప్రతి ఆషాడంలో తన పుట్టింటికి వెళ్తుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాల పేరిట ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
