
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన వారందరి కలలు నెరవేరుస్తూ గతేడాది బాల రామయ్య మందిరం ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. రామాలయంలోని ఐదు మంటపాలలో అతి ముఖ్యమైనదిగా భావించే రంగ మండప శిఖర నిర్మాణం పూర్తైంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరి 11న ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవం ప్రతిష్ట ద్వాదశి వేడుకలకు అయోధ్య రామాలయం సిద్ధమవుతోంది. ఈ వేడుకకు నెల రోజులు కూడా వ్యవధి లేకపోవడంతో రామజన్మభూమి ట్రస్ట్ నిర్వహకులు హుటాహుటిన పనులు నిర్వహిస్తున్నారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ద్వారా ప్రతిష్ట ద్వాదశి వేడుక నిర్వహణ ఏర్పాట్ల కోసం నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. జనవరి 11న ప్రతిష్ట ద్వాదశి రానుంది. వాస్తవానికి ఇది బాలరామయ్య గర్భగుడిలో కొలువుదీరిన రోజు కూడా కావడం విశేషం. ఈ సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత నెలలో బాలరామయ్య ప్రాణ ప్రతిష్ట జనవరి 22న జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయమంతా ప్రత్యేక ఉత్సవాలు, రాత్రి సమయంలో సాంస్కృతి కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.
