ఇక్కడి శివయ్యను పృథ్వీనాథుడని ఎందుకు పిలుస్తారంటే..

ఆసియాలోనే ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం గురించి ఇప్పటికే మనం తెలుసుకున్నాం కదా. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో పృథ్వీనాథ్ ఆలయంలో ఉన్న శివలింగం పైకి 5.4 అడుగుల ఎత్తుతో.. భూమి కింద 64 అడుగుల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తైన శివలింగంగా పేరుగాంచింది. పాండవులు వనవాస సమయంలో ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని చెబుతారు. ఈ శివలింగం 5 వేల ఏళ్లనాటిదట. అంటే మహాభారత కాలం నాటిది. నల్ల గీటురాయితో తయారు చేసిన ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

ఈ శివాలయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు చేయడంతో పాటు జలాభిషేకం చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట. ముఖ్యంగా శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు ఈ పృథ్వీనాథుడి ఆలయానికి వస్తారు. తొలినాళ్లలో ఈ శివలింగం భూమిపైనే ఉండేదట. కాలక్రమేణా భూమిలోకి కూరుకుపోయిందని చెబుతారు. 19వ శతాబ్దంలో గోండా రాజు సైన్యంలో రిటైర్డ్ సైనికుడైన పృథ్వీ సింగ్ ఖర్గుపూర్‌లో తన ఇల్లుని నిర్మించుకోవడానికి పునాది కోసం తవ్వుతున్నప్పుడు ఒక ప్రదేశం నుంచి రక్తపు ఊట రావడం ప్రారంభమైందట. భయపడిపోయిన కార్మికులు తవ్వడం నిలిపివేశారట. ఆ రాత్రి పృథ్వీసింగ్‌కు శివుడు కలలో కనిపించాడు. శివలింగం ఏడు భాగాలుగా భూమి కింద ఉందని చెప్పాడట. మరునాడు పృథ్వీసింగ్ తవ్వకాలు సాగించగా శివలింగం బయటపడింది. దానికి పూజలు చేసి ఆలయాన్ని నిర్మించాడు. పృథ్వీసింగ్ పేరు మీదుగా ఇక్కడి శివుడిని పృథ్వీనాథ ఆలయంగా పిలుస్తారు.

Share this post with your friends