సఫల ఏకాదశి తిథి ఎప్పుడో తెలుసుకున్నాం కదా.. ఈ నెల 26న మనం సఫల ఏకాదశిని జరుపుకోనున్నాం. ఈ రోజున మనం విష్ణుమూర్తిని పూజించుకుంటామని తెలుసుకున్నాం కదా. మరి సఫల ఏకాదశి పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. సఫల ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానమాచరించాలి. ఉపవాసం ఉండదలిచిన వారు ఈ క్షణాన్నే తీర్మానం చేసుకోవాలి. ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసి పీటం పెట్టి దానిపై విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రాన్ని అమర్చాలి. చిత్రపటం ముందు నెయ్యితో దీపం వెలిగించి విష్ణుమూర్తి చిత్ర పటానికి పసుపు, కుంకుమతో బొట్టు పెట్టాలి.
స్వామివారికి ప్రసాదంగా స్వీట్స్‌ను నైవేద్యంగా సమర్పించాలి. అయితే స్వామివారి నైవద్యంలో తులసి దళం వేసి సమర్పించాలి. అనంతరం సాయంత్రం నియమాల ప్రకారం పూజలు చేసి విష్ణు సహస్ర నామాలను పఠించండి. ఆ తరువాత సఫల ఏకాదశి కథ చదవడం కానీ.. వినడం కానీ చేయాలి. పూర్తైన తరువాత హారతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజున ఉపవాసం ఉండట వల్ల పనుల్లో ఆటంకం ఉండదట. ఈ రోజున ఆలయానికి వెళ్లి దీపం వెలిగించినా కూడా మంచి జరుగుతుందట. అలాగే తులసి మొక్కను దానం చేసినా కూడా మంచి జరుగుతుందట. సఫల ఏకాదశి వ్రతం ఆచరిస్తే మనం ఏం కోరుకుంటే అది జరుగుతుందని నమ్మకం.