తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామవారి ఆలయంలోకి ప్రవేశించగానే దర్శనమిచ్చే ఏడు అంతస్తుల మహారాజగోపురం విజయనగర శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. స్థానిక పాలకుడు మట్ల అనంతరాజు నిర్మించిన ఈ గోపురం ద్రావిడ, విజయనగర నిర్మాణ శైలుల సమ్మేళనంగా శతాబ్దాలుగా భక్తులను ఆకట్టుకుంటోంది. మూడు అంతస్తులతో నిర్మించిన పడి కావిలి గోపురం, మహాద్వార గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, విమాన గోపురం బంగారు తాపడంతో దివ్య కాంతులను విరజిమ్ముతోంది.

బంగారు తాపడం – మహాసంప్రోక్షణ
ఆలయంలో 70 సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన పాత ధ్వజస్తంభం స్థానంలో 2018 ఏప్రిల్ 7న నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. అనంతరం 2018 ఏప్రిల్ 12న వైఖానస ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఆలయ విమాన గోపురానికి 100 కిలోల బంగారంతో తాపడం పనులను 2021 సెప్టెంబర్ 14న ప్రారంభించి, 2023 మే 25న బంగారు తాపడం విమాన గోపుర మహాసంప్రోక్షణను అత్యంత వైభవంగా నిర్వహించారు.
క్షేత్ర వైభవం
ఈ మహాక్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి స్థానక రూపంలో, శ్రీ పార్థసారథి స్వామివారు ఆసీన రూపంలో, శ్రీ గోవిందరాజ స్వామివారు శయన రూపంలో దర్శనమిస్తారు. ఒకే ప్రాంగణంలో నిల్చున్న, కూర్చున్న, శయనించిన విష్ణుమూర్తుల సన్నిధులు దర్శనమివ్వడం ప్రపంచంలోనే అరుదైన విశేషంగా భావించబడుతోంది.
