తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ వేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఉంది. మహబూబ్ నగర్ నుంచి 17 కిమీ దూరంలో రాయచూరు మార్గంలో ఉన్న ఈ క్షేత్రాన్ని పేదల తిరుపతిగా తెలంగాణ వాసులంతా భావిస్తారు. ఈ ఆలయం ఈానాటిది కాదు. దీనికి సుమారు 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడి కొండపై శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి ఉండగా.. దిగువన అలివేలు మంగతాయారు కొలువుదీరింది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరుడి గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతోంది. తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకునే ఆర్థిక స్తోమత లేనివారు ఈ మన్యంకొండ వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే తిరుమల శ్రీనివాసుడిని దర్శించకున్నంత పుణ్యం లభిస్తుందట.

ఈ ప్రాంతానికి మన్యంకొండ అని పేరు రావడానికి ఓ కారణముంది. అదేంటంటే.. ఈ దేవస్థానం సమీపంలోనే పూర్వం మునులు తపస్సు చేసుకుంటూ ఉండేవారట. అప్పట్లో ఈ ప్రాంతాన్ని మునులకొండగా పిలిచేవారట. కాలక్రమంలో అది కాస్తా మన్యంకొండగా మారింది. ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది. దానిని ఎవరూ తవ్వలేదట. అలాగే శ్రీవారి పాదాలు సైతం ఉన్నాయి. వాటిని కూడా ఎవరూ చెక్కలేదని వెలిశాయని.. ఉలి సహాయం లేకుండానే స్వామి విగ్రహం సైతం రూపు దిద్దుకుందని అంటారు. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి దెబ్బ పడని స్వామి ఈ క్షేత్ర ప్రత్యేకతలని ఆలయ చరిత్ర చెబుతోంది.
