శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 14 నుండి 16వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఉద‌యం ఆచార్య రుత్విక్‌వరణంలో భాగంగా ఋత్వికుల‌కు విధులు కేటాయించి వ‌స్త్రస‌మ‌ర్ప‌ణ చేశారు. సాయంత్రం ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వ‌హించారు. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 14న ఉదయం పవిత్రప్రతిష్ట‌, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 15న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 16న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి తదిత‌రులు పాల్గొన్నారు.

Share this post with your friends