తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రను వెలికి తీసిన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి..

తిరుపతి, 2024 సెప్టెంబరు 10: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి మహానుభావుల జీవితాలను, వారు చేసిన కృషి, వారి జీవనం యువతకు ఆదర్శనీయమని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విసి ఆచార్య ఉమ చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతి సభ అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య ఉమ “ శ్రీ సుబ్రమణ్య శాస్త్రి గారి పరిశోధన “ అనే అంశంపై మాట్లాడుతూ, శ్రీవారి ఆలయ చరిత్ర వెలికి తీసి శ్రీ సుబ్రమణ్య శాస్త్రి స్వామివారు అనన్య సేవ చేశారన్నారు. రాణి సామవై భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఆలయానికి అందించారని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి వెలికి తీసిన తొలి శాసనమే శ్రీవారి ఆలయ చరిత్ర బయటకు రావడానికి కారణమన్నారు.

తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు “ తాళ్లపాక వారి సాంస్కృతిక శాసనాలు ” అనే అంశంపై ఉపన్యసిస్తూ, తాళ్లపాక వారు 41 శాసనాలలో దేవాలయాల వ్యవస్థ, దాతలు ఇచ్చిన దానాలు, వాటి వినియోగ పద్ధతి, నాటి పాలన, అర్చకులు, పరిపాలన అధికారులు, సేవకులు తదితర అంశాలు వివరించినట్లు తెలిపారు. తాళ్లపాకవారి సాహిత్యం శాసనాల ద్వారా, రాగి రేకుల ద్వారా మనకు అందుతున్నాయని చెప్పారు. తాళ్లపాక వారి శాసనములపై పరిశోధనలు చేసి పరిష్కరించిన శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రికి తెలుగు ప్రజలు రుణపడి ఉన్నారని ఆయన వివరించారు.

అనంతరం ప్రముఖ శాసన పరిశోధకులు తొండవాడకు చెందిన శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని శాసనాలను అనువదించి ఆల‌య చ‌రిత్ర‌ను, శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అని తెలిపారు. టీటీడీలో ఉద్యోగిగా ఉంటూ వెయ్యికి పైగా శాసనాలను వెలికితీసి పరిష్కరించిన గొప్ప వ్యక్తి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి అని చెప్పారు.

Share this post with your friends