తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సందర్భంగా దానికి ముందు కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి. ఆర్జిత సేవలన్నీ రద్దు చేసి మరీ ఈ కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం రాత్రి శ్రీ వేంకటేశ్వర స్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ జరిగింది. శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా వేదపండితులు శ్రీ, భూ, పురుష, నీల, నారాయణ సూక్తాలను మంత్రోచ్ఛారణలతో, ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, పసుపు, చందనం లతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తిరుమల జీయర్ స్వామీజీల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గోవిందరాజ దీక్షితులు పవిత్రోత్సవాలు నిర్వహించారు. అనంతరం నక్షత్ర హారతి, కుంభ హారతి, ప్రత్యేక హారతి సమర్పించి ఆచారం ముగిసింది. అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.