వైకుంఠ ద్వార దర్శనం ఎస్‌ఎస్‌డీ టోకెన్లపై గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె.శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 19న వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తున్నందున ఎస్ఎస్‌డీ టోకెన్లపై టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ మణికంఠ చందోలు, తదితర అధికారులతో కలిసి సమీక్షించారు.
ఈ సమీక్ష సమావేశంలో కొన్ని ముఖ్యాంశాలు :
తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ శుక్రవారం (జనవరి 17)తో ముగిసే అవకాశం ఉంది.
జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేయబడవు. వారు సర్వదర్శనం క్యూ లైన్‌లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
జనవరి 19న ఆఫ్‌లైన్‌లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ చేయబడవు.
అదేవిధంగా, జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఈ కారణంగా జనవరి 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
పైన పేర్కొన్న సూచనలను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకుని టిటిడికి సహకరించాలని కోరడమైనది.
ఈ సమావేశంలో GM(IT) శ్రీ శేషా రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, వీజీవో శ్రీమతి సదాలక్ష్మి తదితర అధికారులు కూడా ఉన్నారు.