శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన అక్టోబరు 12న చక్రస్నాన ఏర్పాట్లపై అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, ఉదయం 6 నుండి 9 గంటల వరకు శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్దగల స్వామి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, ఆ తరువాత చక్రస్నానం నిర్వహిస్తారన్నారు.
ఇందుకోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరిణిలో ఏర్పాటు చేసిన గ్యాలరీలు, స్నానఘట్టాలు పై సమీక్షించారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ భద్రతా సిబ్బందితోపాటు ఎస్‌పిఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భక్తులకు విజ్ఞప్తి
చక్రస్నానం పవిత్రత రోజంతా ఉంటుందని, భక్తులు సంయమనం పాటించి పుష్కరిణిలో స్నానం చేయాలని ఆయన కోరారు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.