తిరుమలలో నిబంధనలు పాటించని హోటళ్ళు, వాహనాలపై టీటీడీ ఎస్టేట్, రవాణా విభాగాలు సోమవారం చర్యలు తీసుకున్నాయి. తిరుమలలో ఆదివారం టీటీడీ ఎస్టేట్ అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా భక్తులకు అధిక ధరలకు తినుబండాలు విక్రయిస్తూ, పరిశుభ్రత లేని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో, తనిఖీలు నిర్వహించారు. తొలుత పిఎసి- 2 (మాధవ నిలయం) వద్ద అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక టీ దుకాణం, రెండు ఫ్యాన్సీ షాపులను సీజ్ చేశారు.
అనంతరం గోవర్ధన్ సత్రాల వద్ద టీటీడీ కేటాయించిన స్థలాల కంటే ఎక్కువ ఆక్రమించుకొని అపరిశుభ్రంగా ఫాస్ట్ ఫుడ్స్ నడుపుతూ భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న 5 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను సీజ్ చేశారు. పిఎసి -1 దగ్గర ఎక్కువ స్థలం ఆక్రమించుకొని వ్యాపారం నిర్వహిస్తున్న 3 హాకర్ లైసెన్స్ దుకాణాలను తాత్కాలికంగా మూత వేసి లైసెన్స్ పత్రాలు తీసుకున్నారు. డిఎంబి రోడ్డులో భక్తులు నడిచేందుకు కూడా వీలు లేకుండా రోడ్డుపై వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేసి వెళ్లారు. మరోసారి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ వరాహ స్వామి అతిథి గృహం వద్ద దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్స్ నిర్వాహకులు పరిశుభ్రత పాటిస్తూ కేటాయించిన మేరకు వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు.
అదేవిధంగా తిరుమలలో ట్యాక్సిడ్రైవర్లు, టెంపో ట్రావెలర్లు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తుల నుండి వచ్చిన పిర్యాదు మేరకు టీటీడీ చర్యలు తీసుకుంది. చిలకలూరి పేటకు చెందిన సురేష్ అనే భక్తుడు తన కుటుంబసభ్యులతో కలిసి దర్శనానికి వచ్చి రామ్ భగీచ బస్టాండ్ వద్ద ఉన్న టెంపో ట్రావెలర్ డ్రైవరు దర్శనం కోసం శిలతోరణం క్యూ లైన్ వద్ద దింపుటకు 14 మందికి రూ.500 రూపాయలు మొత్తము తీసుకొని వారిని ఆక్టోపస్ సర్కిల్ దగ్గర దించి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించి భక్తులు కంప్లైంట్ చేయగా టెంపో ట్రావెలర్ డ్రైవర్ ని గుర్తించి చేసి వారి దగ్గర ఎక్కువ మొత్తం వసూలు చేసినందుకు వారిని ఆర్టీవోకు అప్పగించడం జరిగింది.