తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మరో భారీగా విరాళాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌‌తో పాటు చెన్నైకి చెందిన ట్రేటికొ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీగా విరాళాలను అందించాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులకు రూ.3.70 కోట్ల భారీ విరాళాన్ని.. ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ అందించింది. ఈ మేరకు సంస్థ ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరికి విరాళం చెక్కులను అందజేశారు.

టీటీడీ ట్రస్టుల ద్వారా హిందూ ధర్మ పరిరక్షణ, విద్య, వైద్యానికి చేస్తున్న సేవలకు చేయూతగా విరాళాన్ని అందించినట్లు ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ యజమానులు తెలిపారు. ఇక చెన్నైకి చెందిన ట్రేటికొ ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీ కార్తీక్ ‌ టీటీడీకి చెందిన లారీ చేసేస్ కు రూ.8 లక్షల విలువ గల బాడీ ఫిట్ చేసి బుధవారం ఉద‌యం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ మేర‌కు లారీ రికార్డుల‌ను తిరుమలలోని శ్రీ మలయప్ప స్వామివారి ఆలయం చెంత టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శ్రీ శేషారెడ్డి, తిరుమల డీఐ శ్రీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends