
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వీనుల విందుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గరుడ సేవ అయితే నేత్ర పర్వంగా సాగింది. గరుడ సేవను తిలకిస్తే చాలా మంచి జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఈ సేవను తిలకించారు. వారందరికీ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా టీటీడీ సిబ్బంది సేవలు అందించారు. ఎప్పటికప్పుడు ఆహారంతో పాటు పాలు, కాఫీ, టీ వంటివి అందించారు. మరోవైపు అర్చకులు, వేదపరారాయణదారులు కూడా వారి కర్తవ్యాన్ని క్షణం తీరిక లేకుండా నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలోనే శ్రీ మలయప్ప స్వామివారికి సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహనం బేరర్లు, మేళం సిబ్బందికి బుధవారం రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి వస్త్ర బహుమానం అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్ చేతులమీదుగా వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నట్టు చెప్పారు. వారికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
