శ్రీవారి ఆలయంలో నేడు పుష్పయాగానికి అంకురార్పణ

పవిత్ర కార్తిక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప నవంబరు 9 తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. దీనికి నేటి రాత్రి 8 గంటలకు అంకురార్పణ జరగనుంది. సువాసనలు వెదజల్లే వివిధ పుష్ప, పత్రాలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి క్వింటాళ్ల కొద్దీ తీసుకొచ్చి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీమలయప్ప స్వామికి వేడుకగా పుష్పార్చన నిర్వహిస్తారు. ఈ ఉత్సవం తిరుమల శ్రీవారి ఆలయ సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో కనులపండుగగా జరుగుతుంది. పుష్పయాగం రోజున ముందుగా ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తారు.

అనంతరం సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేష అభిషేకం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగాన్ని వేడుకగా నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్ల జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ వేడుక 15వ శతాబ్దంలోనే మొదలైంది. ఎందుకో కానీ మధ్యలో కొంతకాలం పాటు నిలిచిపోయింది. ఈ ఉత్సవాన్ని తిరిగి 1980లో పునరుద్ధరించారు.

Share this post with your friends