అలిపిరి పాదాల మండపానికి మళ్లీ పూర్వ వైభవం రానుంది. వెయ్యేళ్ల చరిత్రను తనలో దాచుకున్న ఈ పవిత్ర కట్టడాన్ని కాపాడాలనే సంకల్పంతో టీటీడీ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది. కేవలం మరమ్మత్తులుగా కాకుండా, చరిత్రను స్పర్శించే శాస్త్రీయ విధానాలతో పనులు సాగుతున్నాయి. ప్రతి రాయిని ఒక సాక్ష్యంగా భావించి, నంబరింగ్ చేసి, డాక్యుమెంటేషన్ చేస్తూ అత్యంత జాగ్రత్తగా పునర్నిర్మాణం చేస్తున్నారు. పాత రాళ్లకే ప్రాధాన్యం ఇస్తూ… ప్రాచీనతకు ఎక్కడా భంగం కలిగించకుండా పనులు చేపడుతున్నారు. డ్రోన్లు, కెమెరాల పర్యవేక్షణలో సంప్రదాయ నిర్మాణ శైలినే అనుసరిస్తూ, ఆలయ వైభవాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. అలిపిరి మెట్లపై అడుగుపెట్టే భక్తులకు ఈ మండపం ఇకపై చరిత్రను, భక్తిని, వైభవాన్ని ఒకేసారి అనుభూతి పరచనుంది. ఇది కేవలం ఒక రాతి కట్టడమే కాదు, తరతరాల విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం.

