తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు కొనసాగనున్నాయి. మూడు రోజుల పాటు ఆలయంలో భక్తులతో జరపబడే నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం, లక్ష పుష్పార్చన, నరసింహ హోమం వంటి కార్యక్రమాలను రద్దు చేయడం జరిగింది. ఆలయ పునర్ని్ర్మాణం తరువాత పలు కార్యక్రమాలను తిరిగి ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయ పునర్నిర్మాణ అనంతరం భక్తుల తాకిడి కూడా భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి సైతం వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఇప్పటికే ఆలయంలోని పుష్కరిణిని ప్రారంభించారు. ఈ ఆలయం గురించి ఉన్న ఓ కథ ఏంటంటే.. ప్రహ్లాదుడిని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుద్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశాడని చెబుతారు.