తిరుమలకు వెళ్లే మహిళా భక్తులు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..

తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఒక్కోసారి స్వామివారి దర్శనం 48 గంటలు కూడా పడుతుంది. అయినా సరే.. ఓపికగా వేచి ఉండి శ్రీనివాసుని కళ్లారా చూసుకుని తరిస్తారు. అయితే దేవాలయానికి వెళుతున్నామంటే సంప్రదాయబద్దంగానే వెళుతూ ఉంటాం. స్త్రీలైతే చీర.. చక్కగా తలనిండా పూలు పెట్టుకుని వెళ్లడం ఇప్పటికీ మనం చూస్తుంటాం. అయితే తిరుమలలో మాత్రం పువ్వులు పెట్టుకోవడం నిషిద్ధం. ఈ విషయం చాలా మందికి తెలియక పువ్వులు పెట్టుకుంటారు. అసలు పూలు ఎందుకు పెట్టుకోకూడదంటే దీనికి ఒక కారణం ఉంది.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారు నిత్యం ఏదో ఒక అలంకారంలో దర్శనమిస్తుంటారు. ఈ లక్ష్మీ వల్లభుడు పుష్ప ప్రియుడని కూడా అంటారు. అందుకే స్వామివారిని నిత్యం టన్నుల కొద్దీ పూలతో అలంకరిస్తూ ఉంటారు. తిరుమలలో ఎక్కడ చూసినా పూల మొక్కలే దర్శనమిస్తూ ఉంటాయి. తిరుమలలో పూసే ప్రతి పువ్వు శ్రీవారికే అంకితం. కాబట్టి భక్తులు అక్కడి పూలను తాకకూడదన్న నిబంధన ఉంది. ఈ క్రమంలోనే స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు సైతం తలలో పువ్వులను ధరించకూడదట.

Share this post with your friends