తులసి మొక్క దగ్గర చెప్పులు, చీపురు అంటే ఎందుకు ఉంచకూడదనేది అందరికీ తెలిసిందే. మరి వినాయకుడి విగ్రహంతో పాటు శివలింగాన్ని ఎందుకు ఉంచకూడదు? అనే సందేహం రావొచ్చు. దీనికి ఒక కారణం ఉంది. వినాయకుడి విగ్రహం తులసి మొక్క వద్ద ఉంచకూడదు అనడం వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉంది. అదేంటంటే.. ఒకరోజు వినాయకుడు నది ఒడ్డున తపస్సు చేస్తున్నాడట. అదే సమయంలో తులసీ మాత నదిలోంచి బయటకు వచ్చిందట. గణపతిని చూసి ఆయన అందానికి ముగ్దురాలై తనను వివాహం చేసుకోవాలని కోరిందట.
అయితే గణేషుడు నిరాకరించాడట. దీంతో ఆగ్రహించిన తులసీ మాత నీవు రెండు వివాహాలు చేసుకుంటావని శపించిందట. అప్పటి నుంచి తులసి చెట్టు వద్ద వినాయకుడి ప్రతిమను పెట్టకూడదని అంటారు. ఇక శంకరుడి విషయానికి వస్తే గత జన్మలో తులసి.. బృందగా జన్మించింది. జలంధరుడు అనే రాక్షసుడిని వివాహమాడింది. బృంద మహా పతివ్రత. జలంధరుడికి బృంద పాతివ్రత్యానికి భంగం వాటిల్లితే తప్ప చావు రాదనే వరం ఉంది. తన వర గర్వంతో జలంధరుడు సామాన్యులతో పాటు దేవతలను సైతం హింసించగా.. వారంతా శివుడిని ఆశ్రయించారు. అప్పుడు పరమేశ్వరుడు బృంద పాతివ్రత్యానికి భంగం కలిగేలా చేసి జలంధరుడిని సంహరించారు. అందుకే తులసి వద్ద శివలింగాన్ని పెట్టకూడదని వేద పండితులు చెబుతారు.