
హిందూ పండుగలలో దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. దీనిని ఆశ్వయుజమాస బహుళ అమావాస్య రోజున జరుపుకోవడం ఆనవాయితీ. దీపావళి అంటే దీపముల వరుస అని అర్థం. ఈ పండుగ సమయంలో మూడు రోజులు లేదంటే ఐదు రోజుల పాటు దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కుదరని వారు కనీసం దీపావళి ఒక్క రోజైనా ప్రతి ఇంటా దీపాలను వెలిగిస్తారు. ప్రతి ఇల్లు దీపాలతో ప్రత్యేక కళను సంతరించుకుంటుంది. అయితే దీపాలను మనం నువ్వుల నూనెతో వెలిగిస్తాం. అసలు ఎందుకు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తామో తెలుసుకుందాం.
దీపావళి నాడు మనం లక్ష్మీదేవిని పూజించుకుంటాం. దీనికి కారణం లక్ష్మీదేవికి నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే చాలా మంచిదట. అమ్మవారికి అనుగ్రహం లభిసన్తుందని నమ్మకం. ఇటీవలి కాలంలో బ్యాటరీతో వెలిగే దీపాలు కూడా వచ్చాయి. అవి ఎన్ని వెలిగించినా కూడా ఇంటి ప్రధాన ద్వారం వద్ద, తులసి మొక్క దగ్గర తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే మంచిదని నమ్మకం. దీపాన్ని మనం జ్ఞానానికి.. ఐశ్వర్యానికి.. సంపద, ఆనందాలకు చిహ్నంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి మనం దీపావళి నాడు దీపాలను తప్పనిసరిగా పెట్టుకుంటాం.
