కైలాస మానస సరోవర యాత్ర ఎంత క్లిష్టతరమైనదో తెలుసుకున్నాం. మరి అంతటి క్లిష్టతరమైన యాత్రను ఎందుకు భక్తులు చేస్తారు? ప్రథమ గణనాయకుడు అక్కడ కొలువై ఉన్నాడనా..? లేదంటే మరో కారణమా? అంటే కైలాస యాత్ర చేసే వారందరి లక్ష్యం ఒక్కటే. ఆధ్యాత్మిక చింతన. అయితే అది లేని వారు చేయరా? అంటే వారికి తోడుగా చేస్తారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. తోడుగా వెళ్లిన వారు సైతం ఆ ప్రదేశానికి వెళ్లగానే అదేం మాయో తెలియదు కానీ భక్తి వైరాగ్యంలో మునిగిపోతారు. ఆ ప్రదేశం మహత్యం అలా ఉంటుంది.
కైలాస పర్వతంపై ఒక రహస్యమైన ఆధ్యాత్మిక రాజ్యం ఏదో ఉండే ఉంటుందనేది చాలామంది భావన. కొందరు ఈ ఆధ్యాత్మిక రాజ్యాన్ని శంబాలా అని పిలుస్తారు. దీనికి ఎవరు పడితే వారు వెళ్లాలనుకుంటే సాధ్యం కాదట. దీనినొక మర్మదేశంగా అభివర్ణిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎన్నో పర్వతాలున్నాయి. కానీ వాటన్నింటినీ అధిరోహించిన వారికి సైతం కైలాస పర్వతాన్ని అధిరోహించడం కష్టమట. ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు యత్నించినా కొందరు ఏమైపోయారో కూడా తెలియదట. మరికొందరు మరణించారని చెబుతారు. అందుకే కైలాస పర్వత రహస్యమేంటో తెలియక పర్వతారోహణపై నిషేధం విధించారు.