తిరుమలలో పుష్కరిణిని నెల రోజుల పాటు మూసివేసి ఇటీవలే తెరిచారు. ఇక ఈ పుష్కరిణి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. వేంకటాచలంలోని పుష్కరిణి మానవనిర్మితం కాదు, స్వయంవ్యక్తం. స్వామి పుష్కరిణి అనే ప్రసిద్ధి ఈ ఒక్క పుష్కరిణికే దక్కింది. దీని అసలు పేరు వరాహపుష్కరిణి. ఈ పుష్కరిణి గురించి వరాహ-మార్కండేయ వామన- స్కాంద – బ్రహ్మ – భవిష్యోత్తర పురాణాలు అభివర్ణిస్తున్నాయి.వేంకటాచలంలో గల మూడుకోట్ల తీర్థాలకు స్వామి పుష్కరిణి అవతారస్థానమని ప్రసిద్ధి.
దివ్య తేజోపేతం, సుగంధభరితమైన ఈ పుష్కరిణి సర్వతీర్థాలకు ఉత్పత్తి స్థానమని, శ్రీనివాసుడు వేంకటాద్రిపై అవతరించకముందే ఆవిర్భవించిందని వరాహపురాణం చెబుతోంది. వరాహస్వామి నివాసం స్వామిపుష్కరిణీ తటాన ఉండడంవల్ల, ఆయన ఆజ్ఞచే గరుడుడు దీన్ని వైకుంఠం నుండి తీసుకొనిరావడం వలన దీనికి ”వరాహపుష్కరిణి” అనే పేరు సంక్రమించింది. ఈ పవిత్ర స్వామిపుష్కరిణిలో ”తొమ్మిది తీర్థాలు”న్నాయి. కుబేరతీర్థం, గాలవతీర్థం, మార్కండేయతీర్థం, అగ్నితీర్థం – యమతీర్థం, వశిష్ఠతీర్థం, వరుణతీర్థం, వాయుతీర్థం, సరస్వతీతీర్థం ప్రధానమైనవి. ఒకే రోజున ఈ తొమ్మిది తీర్థాల్లో స్నానంచేసి స్వామిపుష్కరిణీ తీరంలో ఉన్న స్వామి వారిని దర్శిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అనేది భక్తుల నమ్మకం.