ధనుర్మాసానికి ఎందుకంత ప్రత్యేకత?

కార్తీక మాసం, శ్రావణ మాసం మాదిరిగానే ప్రాధాన్యత ఉన్న మాసం వచ్చేసి ధనుర్మాసం. ఈ మాసానికి ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ధనుర్మాసం ఏర్పడుతుంది. దీనికి అత్యంత విశిష్టత ఉంది. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలైంది. ధనుర్మాసంలో నిత్యం చేయవలిసిన కొన్ని కార్యక్రమాలున్నాయి. అవేంటంటే.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి, దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేస్తే మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయట. తెలుగు రాష్ట్రాలలో ఈ మాసాన్ని పండుగ నెల అని అంటారు.

ధనుర్మాసం విష్ణు మూర్తికి అంకితమైన మాసం. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించుకుంటూ ఉంటారు. ఇక తిరుమలలో అయితే ధనుర్మాసంలోనే నెలరోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్క తిరుమలలోనే కాకుండా అన్ని విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా నివేదనలు చేసి పిల్లలకు పంచడాన్ని బాలభోగం అంటారు. ఈ మాసం మానవమాత్రులకే కాకుండా దేవతలకు సైతం బ్రహ్మీ ముహూర్తం వంటిదని చెబుతారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు విష్ణు ఆలయాలన్నీ సందడిగా ఉంటాయి.

Share this post with your friends