వినాయక చవితి వస్తుందంటేనే ఒకరోజు ముందుగానే వినాయకుడితో పాటు పూజకు కావల్సిన వస్తువులన్నీ సిద్ధం చేసుకుంటాం. మరీ ముఖ్యంగా వినాయకుడికి పాలవెల్లిని రెడీ చేస్తాం. పాలవెల్లికి పసుపు, కుంకుమ రాసి.. రకరకాల పండ్లు.. జొన్న పొత్తులు, మామిడి ఆకులు, పువ్వులతో అందంగా సిద్ధం చేసిన పాలవెల్లిని వినాయకుడి తలపై కడతాం. వాస్తవానికి పాలవెల్లి లేకుంటే గణపతి పూజ సంపూర్ణం కాదని చెబుతారు. అంతటి ప్రాధాన్యమిచ్చే పాలవెల్లి కథేంటి? అసలు ఎందుకు పాలవెల్లిని కట్టే సంప్రదాయం వచ్చింది? దాదాపు చాలా మందికి తెలియదు. అదేంటో చూద్దాం.
గణపతి అంటే గణాలకు అధిపతి. ఆకాశంలో పాలపుంత ఉంటుంది. అంటే సూర్యుడితో పాటు కోటాను కోట్ల నక్షత్రాల సముదాయమే పాలపుంత. దానికి చిహ్నంగానే వినాయక చవితికి పాలవెల్లిని కడతారు. భూమి(సృష్టి)ని సూచిస్తూ మట్టి వినాయకుడు.. జీవానికి (స్థితి) చిహ్నంగా పత్రినీ, ఆకాశానికి (లయం)కి చిహ్నంగా పాలవెల్లిని గణపతిపై కడతారు. అలాగే ముక్కోటి దేవతలందరికీ చిహ్నంగానే మనం పాలవెల్లిని కడుతుంటాం. పాలవెల్లి అంటే సకల దేవతలకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. అందుకే వినాయక చవితి నాడు ప్రపంచానికి అధిపతి అయిన వినాయకుడికి ఛత్రంగా పాలవెల్లిని తప్పని సరిగా కడతారు.