ఏ ఆలయంలోనైనా స్వామి, అమ్మవార్లకు వేరువేరుగా మాలలను వేస్తారు. కానీ శ్రీవిల్లిపుత్తూరులో మాత్రం అమ్మవారి మాలనే స్వామివారికి వేస్తారు. దీనికి కారణం వెనుక ఓ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. విష్ణుచిత్తుడు అనే వ్యక్తి నిత్యం కన్నయ్య సేవలో తరిస్తుండేవాడు. ాయనకు ఒకరోజు తులసి వనంలో పాప దొరుకుతుంది. సంతానం లేకపోవడంతో విష్ణుచిత్తుడు ఆ పాపను ఇంటికి తీసుకెళ్లి గోదా అనే పేరు పెట్టుకుని పెంచుకున్నాడు. గోదాదేవికి చిన్ననాటి నుంచే శ్రీకృష్ణుడిపై అమితమైన భక్తితో ఉండేది. చిన్న వయసులోనే కన్నయ్యను కీర్తిస్తూ పద్యాలు రాసేది.
ప్రతిరోజూ కృష్ణుడి కోసం తయారు చేసిన పూలమాలను ముందుగా తను ధరించి ఆ తరువాత కృష్ణుడికి పంపేది. ఒకరోజు విషయం విష్ణుచిత్తుడికి తెలిసింది. దీంతో భగవంతుని పట్ల అపచారం జరిగిందన్న బాధతో ఆలయానికి వెళ్లడం మానేశాడు. అప్పుడు విష్ణుచిత్తుడికి స్వామివారు కలలో కనిపించి గోదా ధరించిన మాలలంటే తనకు ఇష్టమని.. వాటిని తనకు ధరింపచేయాలని కోరాడు. అలా గోదాదేవి పెరిగి పెద్దై ఆండాళ్‌గా మారింది. కన్నయ్యను భర్తగా పొందాలనే కోరికతో 30 పాశురాలను రచించింది. ఆమె కోరికను మన్నించిన కన్నయ్య స్వరూపమైన శ్రీరంగంలోని రంగనాధుడు గరుడ వాహనంపై రాజు రూపంలో శ్రీవిల్లిపుత్తూర్ వచ్చాడు. అనంతరం గోదాదేవిని పరిణయమాడటంతో ఆమె స్వామిారిలో ఐక్యమైందట.