శ్రీరాముడిని చూసిన వైష్ణోదేవి.. తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది. తాను ఏకపత్నీ వ్రతుడనని.. కాబట్టి ఈ జన్మకు అది సాధ్యపడదని వచ్చే జన్మలో తనను గుర్తు పడితే వివాహం చేసుకుంటానని వైష్ణోదేవికి మాటిచ్చాడు. మరి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు అమ్మవారిని వివాహం చేసుకోవాలి కదా.. ఎందుకు చేసుకోలేదు? అంటే దీనికి కూడా ఓ కథ ఉంది. వైష్ణోదేవికి ఇచ్చిన మాట ప్రకారం త్రేతాయుగం చివరలో శ్రీరాముడు ఓ వృద్ధుని రూపంలో త్రికూట పర్వత ప్రాంతానికి వెళ్తాడు. ఆయనను వైష్ణోదేవి చూస్తుంది కానీ వృద్ధుడి రూపంలో ఉండటంతో గుర్తించలేకపోతుంది.
అప్పుడు శ్రీరాముడు ఈ జన్మలో కూడా నాకు.. నీకూ వివాహం కాదని తేల్చి చెప్పేశాడు. మరి ఎప్పుడని వైష్ణోదేవి అడగ్గా.. కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మ సంస్థాపనకు తాను కల్కి అవతారం ఎత్తుతానని.. అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని చెబుతాడు. అందుకే వైష్ణో దేవి ఇప్పటికీ త్రికూట పర్వతంపై శ్రీరాముడు కల్కి అవతారంలో వచ్చి తనను వివాహం చేసుకుంటాడని ఎదురుచూస్తూనే ఉందట. ఇక ఈ ఆలయానికి సంబంధించి మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాండవులను ఈ వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించమని చెప్పాడట. శ్రీకృష్ణుని ఆదేశం మేరకు పాండవులు మహాభారత సంగ్రామానికి ముందు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారట. ఈ ప్రభావం కారణంగానే పాండవులు18 రోజుల్లో విజయం సాధించారని స్థలపురాణం.