
సీతా దేవి జాడ కోసం వెదుకుతున్న శ్రీరామచంద్రునికి సుగ్రీవుడు ఎలా సాయపడ్డాడనేది తెలుసుకున్నాం కదా. భూమండలం గురించి ఎక్కడ కొండలు, గుట్టలు, నదులు, వాగులు, వంకాలున్నాయో కూలంకషంగా వివరించాడు. అప్పుడు శ్రీరాముడు ఇవన్నీ నీకెలా తెలుసని ప్రశ్నించగా..సుగ్రీవుడు ఇలా సమాధానం చెప్పాడు. ’’నా సోదరుడు వాలి తనను కిష్కంద నుంచి బహిష్కరించి.. నేను ఎక్కడికి వెళ్లినా నిలువ నీడ లేకుండా చేస్తుండేవాడు. అలా ఒకచోటి నుంచి మరోచోటికి మారుతూ ఆయా ప్రదేశాలన్నింటిని చూశా. అంతకుముందు మాయావి అనే రాక్షసుడిని చంపడానికి వాలి తరమగా మరికొన్ని ప్రదేశాలను చూశా’’ అని చెప్పాడు. అసలు అన్నదమ్ములకు గొడవే ఈ మాయావి కారణంగా వచ్చింది.
ఆ కథ కూడా రామయ్యకు సుగ్రీవుడు వివరించాడు. మాయావిని వాలి తరుముతుండగా వెళ్లి ఒక గుహలో దూరాడట. వాలి సైతం మాయావిని అంతం చేసే లక్ష్యంతో ఆ గుహలోకి వెళ్లగా గుహ బయట సుగ్రీవుడు కాపలాగా ఉన్నాడట. రోజుల తరుబడి యుద్ధం సాగుతుంది. ఒకరోజు ధారాళంగా రక్తం బయటకు ప్రవహించింది. దీంతో వాలిని రాక్షసుడు సంహరించాడని భావించిన సుగ్రీవుడు.. కిష్కింద పైకి మాయావి దండెత్తి రాకుండా గుహకు ఒక పెద్ద రాయిని అడ్డుగా పెట్టి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. వాలి మరణించాడని చెప్పడంతో, రాజ్య మంత్రులు నువ్వే రాజుగా ఉండాలని కోరడంతో సింహానాన్ని అధిష్టించాడు. కొద్ది రోజులకు మాయావిని సంహరించి వాలి రాజ్యానికి వచ్చి ఎంత చెప్పినా వినకుండా వాలిని చంపబోయాడు. అలా వాలి నుంచి తప్పించుకుంటూ నలుదిశలా పరిగెత్తినట్టు శ్రీరాముడికి సుగ్రీవుడు చెప్పాడు.
