శ్రీకృష్ణుడు ఉంటే రాధతో లేదంటే రుక్మిణితోనో అదీ కాదంటే సత్యభామతోనో కనిపిస్తాడు. ఇస్కాన్ ఆలయాల్లో అయితే మనకు రాధాకృష్ణులు దర్శనమిస్తారు. అయితే రాధాకృష్ణులతో రుక్మిణి దేవిని మనం ఎక్కడైనా చూడగలమా? అంటే అలాంటి ఆలయం ఒకే ఒక్క చోట ఉంది. హిందూ మత గ్రంధాలలో రుక్మిణి దేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శ్రీకృష్ణుని పెద్ద భార్య. కానీ ఎక్కడైనా మనకు ఎక్కువగా కనిపించేది మాత్రం రాధాకృష్ణులే. రాధాకృష్ణులతో రుక్మిణీ దేవి కనిపించే ఏకైక ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉంది.
ఝాన్సీలోని బడా బజార్‌లోని మురళీ మనోహర దేవాలయం పేరుతో ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు రాధా, రుక్మిణిల సమేతంగా కొలువై ఉన్నారు. మధ్యలో శ్రీకృష్ణుడు, ఒకవైపు రాధ, మరొక వైపు రుక్మిణి మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి బక్తులు వస్తుంటారు. ఈ దేవాలయం 250 ఏళ్లనాటిదట. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అత్తగారు సక్కు బాయి 1780లో ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. 1842లో తన వివాహానంతరం ఝాన్సీలక్ష్మి బాయి కూడా పూజలను చేయడానికి ఈ ఆలయానికి వెళ్ళేదట. అయితే ఈ ఆలయంలో రాధా-కృష్ణులతో పాటు రుక్మిణిదేవి కూడా ఎందుకుందనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు.