దేశంలో హిండింబాకి, జటాయువుకి ఆలయాలున్నాయని తెలుసుకున్నాం కదా. అలాగే దుర్యోధన, శకుని, కర్ణుడికి కూడా ఆలయాలున్నాయి. ఆ ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం.
శకుని ఆలయం: మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తులతో శకుని కూడా ఒకరు. శకుని మరెవరో కాదు.. గాంధారికి సోదరుడు, కౌరవులకు స్వయానా మేనమామ. తన పగతో అయినవారితోనే ఆటలాడిన శకుని దుష్ట పన్నాగాలతో పాండవులను మాయా జూదంలో ఓడించాడు. అంతేకాకుండా పాండవులను రాజ్యం నుంచి వెల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించి.. చివరకు కురుక్షేత్ర యుద్ధానికి బాటలు వేశాడు. అలాంటి శకునికి సైతం మన దేశంలో ఆలయం ఉంది. ఈ ఆలయం కేరళలోని కొల్లం జిల్లాలోని పవిత్రేశ్వరంలో ఉంది. ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది దర్శనం కోసం వస్తారు.
దుర్యోధన ఆలయం: దృతరాష్ట్రుడికి గాంధారికి 100 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో దుర్యోధనుడే ప్రధముడు. దుర్యోధనుడికి సైతం మన దేశంలో ఆలయం ఉంది. కేరళలోని కొల్లంలో శకుని ఆలయానికి సమీపంలోనే దుర్యోధనుడి ఆలయాన్ని నిర్మించారు. దేశంలో దుర్యోధనుడికి ఉన్న ఏకైక ఆలయం ఇదే. శకుని ఆలయాన్ని సందర్శించే వారు ఖచ్చితంగా ఈ దుర్యోధనుడి ఆలయాన్ని సైతం సందర్శిస్తారు.
కర్ణుడి ఆలయం: కుంతీదేవి, సుర్యుడుకి జన్మించిన కర్ణుడు మహాభారతంలోని ముఖ్యులలో ఒకడు. కర్ణుడు దానధర్మాల్లోనే కాదు.. వీరుడు, శూరుడు. మహాభారత కాలానికి సాక్షిగా ఉన్న ఈ ఆలయం యూపీలోని మీరట్ నగరానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం ఎంత అద్భుతంగానే కాకుండా చాలా ఆసక్తికరంగానూ ఉంటుంది. ఈ ఆలయం లోపల పురాతన శివలింగం ఒకటి ఉంది. ఈ శివలింగానికి నీరు సమర్పిస్తే ఆగిన పనులు పూర్తవుతాయని నమ్ముతారు. ఈ శివలింగాన్ని స్వయంగా కర్ణుడే ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.