హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో వైకుంఠ ఏకాదశి ఒకటి. ఈ రోజున ఏదైనా వైష్ణవ క్షేత్రంలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే కలియుగ వైకుంఠంగా బావించే తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అసలెందుకు తిరుమలకే భక్తులు పోటెత్తుతారు. వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు స్వామివారు ఇచ్చే ఉత్తర ద్వార దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు.
ఈ వైకుంఠ ఏకాదశిని కొన్ని ఏళ్ల క్రితం వరకూ ఒకే రోజు నిర్వహించేవారు. తరువాత క్రమక్రమంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే 1980, 1990లలో అధికారులు వైకుంఠ ద్వాదశిని అదనపు పవిత్రమైన రోజుగా గుర్తించడం ద్వారా ఉత్సవాలను పొడిగించారు. పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాన్ని పొడిగించారు. ఈ తిరుమలలో వేంకటేశ్వరునిగా పూజలందుకుంటున్న శ్రీ మహా విష్ణువు ఈ సమయంలో తనను దర్శించుకున్న వారికి స్వర్గలోకం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే పెద్ద ఎత్తున భక్తులు వైకుంఠ ఏకాదశికి పోటెత్తుతారు.