శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కొలవని వారు ఎవరుంటారు? దేశ విదేశాల్లోనూ స్వామివారికి పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. అందుకే విదేశాల్లో కూడా వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు వెలుస్తున్నాయి. ఇక వేంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆలయాలు ఎన్ని ఉన్నా కూడా తిరుమల స్థానం ఏదీ భర్తీ చేయలేదు. అయితే ఆ ఆలయం తర్వాత స్థానంలో మాత్రం చాలా ఆలయాలున్నాయి. శ్రీకాకుళం పట్టణంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఇది నారాయణ తిరుమలగిరిపై ఉంటుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే.. తిరుమలకు వెళ్లలేని వారంతా ఇక్కడి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
ఇక్కడి తిరుమలగిరి కొండపై ప్రకృతి సౌందర్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేదాంత ప్రవక్త అయిన గురుగుబెల్లి నారాయణదాసు అనే భక్తుడి కలలో శ్రీవేంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై కొండపై ఆలయం నిర్మించమని ఆదేశించారట. దీంతో కొండ కోసం అన్వేషించిన నారాయణ దాసు నాగావళి నదికి పశ్చిమ దిశలోని ఒక కొండను ఎంపిక చేశాడు. అదే నారాయణ తిరుమలగిరి కొండ. ఈ కొండపైని స్వామివారి పాదాల గుర్తులను చూసిన నారాయణదాసు వెంటనే అక్కడ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. 1961వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం జరిగింది. భూనీలా సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహాలను తిరుపతిలో తయారు చేయించి.. వాటిని పాంచరాత్రాగమ ప్రకారం ప్రతిష్టించాడు.