దేవీ నవరాత్రులను జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమవుతుంది. నవరాత్రి మొదటి రోజున ముందుగా కలశాన్ని ప్రతిష్టిస్తారు. ఆ తరువాత దుర్గాదేవి పూజ ఆరంభమవుతుంది. అసలు కలశ స్థాపన ఎందుకు చేస్తారు? అంటే దుర్గాదేవి కలశంలో నివసిస్తుందని నమ్మకం. అందుకే కలశాన్ని తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. అయితే కలశాన్ని ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. దానికి ఒక ప్రత్యేక సమయం అంటూ ఉంటుంది. అసలు కలశ స్థాపన లేకుంటే పూజ సంపూర్ణం కాదు. అలాగే పూజా ఫలితం కూడా పూర్తిగా దక్కదు.
నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఉదయం పూట ఒక శుభ సమయాన్ని చూసుకుని ప్రతిష్టిస్తారు. అసలు నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? కలశ స్థాపనకు శుభ సమయం ఏంటో చూద్దాం. ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3వ తేదీన 00:18 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీ ఉదయం 02:58 వరకూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ఆధారంగా ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఆ రోజున కలశ ప్రతిష్టాపన శుభ సమయం ఏంటంటే.. ఉదయం 6.15నుంచి 7.22 వరకు ఉంటుంది. ఈ సమయంలో కలశ స్థాపన చేస్తే మంచిదట. మధ్యాహ్నం కూడా కలశ స్థాపన చేయవచ్చు. మధ్యాహ్నం 11:46 నుంచి 12:33 వరకూ కలశ స్థాపన చేయవచ్చు.