సంవత్సరంలో అతి పెద్ద ఏకదశిగా నిర్జల ఏకాదశిని పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున చేసే ఉపవాసం ఇతర ఏకాదశిల మాదిరిగా ఉండదు. అయితే ఫలితం కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుంది. పేరులోనే ఉంది కదా.. నిర్జల అని.. కనీసం జలం కూడా తీసుకోకుండా ఈ ఉపవాసం చేయాల్సి ఉంటుంది. ఏకాదశి తిథి అనేది శ్రీ మహా విష్ణువుకు అకింతం చేయడం జరిగింది. ఈ రోజున ఉపవాసం చేసి పూజలు చేస్తే శ్రీహరి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయట. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదట. మరి ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఎప్పుడు అంటారా? ఈ నెల 18నే. ఈ రోజున ఉపవాసం చేస్తే శ్రీహరితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట.
హిందూ క్యాలెండర్ ప్రకారమైతే ప్రతి నెలలోనూ రెండు ఏకాదశి తిథులు ఉంటాయి. వాటిలో ఒకటి కృష్ణపక్షంలోనూ.. రెండోది శుక్ల పక్షంలోనూ వస్తుంది. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి జూన్ 17 ఉదయం 4.43 గంటలకు ప్రారంభమై.. జూన్ 18 ఉదయం 7.28 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతం జూన్ 18న చేయాల్సి ఉంటుంది. నిర్జల ఏకాదశి నాడు ఏమీ తినకూడదు సరికదా.. కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలనే నియమం ఉంది. సంవత్సరంలోని అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉండలేని వ్యక్తి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే అవన్నీ చేసిన ఫలితం లభిస్తుందట. అంతేకాకుండా ఈరోజున ఉపవాసం చేయడం వలన అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుందట.