గురు పూర్ణిమ ఎప్పుడు? పూజా విధానం ఏంటి?

ఆషాఢ మాసంలోనూ కొన్ని ముఖ్య తిథులను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా శుక్లపక్ష పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటాం. అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం? ఎవరిని పూజించుకుంటాం వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానం, గురువులకు గౌరవం, ఆధ్యాత్మిక పురోగతికి ప్రతీకగా ఈ పండుగను హిందువులంతా జరుపుకుంటారు. ఈ నెల 10వ తేదీ గురువారం నాడు మనం గురు పూర్ణిమను అత్యంత వైభవంగా జరుపుకోనున్నాం. వ్యాసమహర్షి జయంతిగా కూడా ఈ పండుగ పేరొందింది. గురుపూర్ణిమ రోజు చాలామంది షిర్డీ సాయిబాబాను గురువుగా భావించి పూజలు చేస్తారు. అయితే కొందరు దత్తాత్రేయ, వీరబ్రహ్మేంద్ర, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి వంటి గురువులను కూడా ఈరోజు పూజించుకుంటారు.

మరి సాయిబాబాకు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. తెల్లవారుజామునే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి ఇంటితో పాటు పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. పూజ గదిలో ఒక పీటను ఏర్పాటు చేసి దానిని పసుపు, కుంకుమ, బియ్యం పిండితో అలంకరించి దానిపై సాయిబాబా ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఆపై విగ్రహాన్ని పసుపు, తెలుపు, ఎరుపు పువ్వులతో అలంకరించాలి. ఈ పూజలో ప్రత్యేకత ఏంటంటే.. సాయిబాబాకు శనగల మాలను సమర్పిస్తారు. ముందుగా వినాయకుడి పూజ చేయాలి. ఆ తరువాత సాయిబాబా పూజను ప్రారంభించాలి. “ఓం శ్రీ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై” అంటూ పూజను ప్రారంభించాల్సి ఉంటుంది. పాలు లేదా పంచామృతాలతో సాయిబాబా చిత్రపటాన్ని అభిషేకించి.. అక్షింతలు, పువ్వులు సమర్పించి, అష్టోత్తరాలు పఠించాలి. శ్రీసాయి సచ్చరిత్రము చదివి సాయిబాబాకు పళ్ళు, పచ్చి శనగలు, కోవా, పొలగం, చపాతీ, బ్రెడ్, కిచిడి వంటి నైవేద్యాలను సమర్పించి హారతి ఇవ్వాలి.

Share this post with your friends