అప్పలాయగుంట పూర్వ నామం అన్‌రుణ సరోవరం వెనుక కథేంటి?

శ్రీనివాసుడు నారాయణపురంలో ఆకాశ రాజు కుమార్తె పద్మావతీ దేవిని వివాహం చేసుకున్న తరువాత కాలినడకన తిరుమలకు వెళుతూ మార్గమధ్యంలో అప్పలాయగుంటలో ఆగారట. అయితే పూర్వం అప్పలాయగుంట ప్రాంతాన్ని అన్ఋణ సరోవరం అంటే ఋణం లేని సరోవరం అని పిలిచేవారు. ఈ ప్రాంతానికి అప్పలాయ గుంట అనే పేరు రావడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. అప్పులయ్య అనే వ్యక్తి పేరు మీదుగా ఈ ప్రాంతానికి అప్పలాయగుంట అనే పేరు వచ్చిందట.

పూర్వం ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఈ అప్పులయ్య తనపేరుకు తగ్గట్టుగానే కనిపించిన వారందరి దగ్గరా అప్పులు చేస్తూ ఉండేవాడు. అదే ఊరికి చెందిన మరో వ్యక్తి అప్పులయ్య సంగతి తెలిసి అతని దగ్గర ఎలాగైనా డబ్బులు కాజేయాలన్న దురాశ కలిగింది. దీంతో అప్పులయ్య తనకు కూడా బాకీ ఉన్నాడని బాకీ తీర్చమని వేధింపులు మొదలు పెట్టడమే కాకుండా ఆ విషయాన్ని ఊరంతా చెప్పాడు. ఊరి జనమంతా అప్పులయ్య అందరి దగ్గరా అప్పులు చేస్తుంటాడు కాబట్టి అది నిజమేనని నమ్మారు. అప్పులయ్య తానా వ్యక్తి దగ్గర అసలు అప్పే చేయలేదన్నా ఎవరూ నమ్మలేదు. చివరకు విసిగిపోయిన అప్పులయ్య తాను ఋణం తీసుకోలేదని ఒక రాయి మీద రాసి కోనేటిలో వేయగా అది తేలింది. అది చూసిన గ్రామస్తులు అప్పులయ్య నిజాయితీ పరుడని నమ్మడమే కాకుండా ఆ కోనేటిని అన్ రుణ సరోవరమని పిలవడం ఆరంభించారు. ఇక అప్పలాయగుంట అనే పేరెలా వచ్చిందంటే.. అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వించగా ఆ ప్రదేశం అప్పలాయగుంటగా మారిందని చెబుతారు.

Share this post with your friends