
సత్యాన్ని వెతుకుతూ పోయి దాని ఆధారంగా ఉండే బ్రహ్మం ఇదేనని తెలుసుకోగలిగితే మానవ జీవితానికి అంతకు మించిన పరమార్ధం లేదు. సామాన్యులు కూడా సత్యాన్ని తెలుసుకోవచ్చు, బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని వివరించేవే బ్రహ్మంగారి తత్త్వాలు. కాలజ్ఞాని, దైవస్వరూపుడు అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన తత్త్వాలే బ్రహ్మంగారి తత్త్వాలుగా లోకంలో ప్రచారంలోకి వచ్చాయి. పదిహేడో శతాబ్దం మధ్యకాలం నుంచి బ్రహ్మంగారి కాలజ్ఞాన వచనాలు, గోవింద నామాలు, తత్త్వాలు, ద్విపదలు, పాటలు, కందార్ధ దరువులు, వచనాలు అన్నీ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాయి.
అభ్యుదయ భావాలతో నిండి వినడానికి మధురంగా, జ్ఞానసుబోధకంగా ఉండడమే బ్రహ్మంగారి తత్త్వాల ప్రత్యేకత. దీంతో అవి ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయన సృష్టించిన ఇతర సాహిత్యం నిండా తత్త్వోపదేశంతో పాటు, ఆనాటి భాషా సౌందర్యం, పడికట్టు పదాలు కనిపిస్తాయి. సామాజిక చైతన్యం కలిగిస్తూ అస్పృశ్యత, మద్యపానం తదితర సామాజిక రుగ్మతలను దుయ్యబడుతున్నట్లుగా కనిపిస్తాయి ఆయన తత్త్వాలు. మత సామరస్యం, శాంతి కామనల అవసరాన్ని తెలియ చెబుతూ ఉంటాయి. అలాగే బ్రహ్మంగారి సాహిత్యంలో సామాజిక పరంగా ఆర్ధిక సమానత్వం లాంటి అంశాల ప్రస్తావన కూడా కనిపిస్తుంది.
