
హిందూ సంప్రదాయంలో పండుగల సమయంలో అలాగే కొన్ని ముఖ్య తిథుల సమయంలోనూ ఉపవాసం చేయడం సర్వసాధారణం. అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే ఉపవాసానికి ఫలితం చాలా బాగుంటుందని నమ్మకం. అసలు ఉపవాసం అంటే ఏమిటి? కార్తీక మాసంలో ఈ ఉపవాసాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. కార్తీక మాసం మొత్తం చాలా మంది మాంసాహారం ముట్టరు. అలాగే ఒంటి పూట మాత్రమే భోజనం చేస్తారు. ఇలా నెల మొత్తం చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉంటారు.
ఉపవాసం ఎలా చేయాలంటే.. ఉండగలిగిన వారు రోజంతా ఆహారం ఏమీ తీసుకోకుండా ఉండవచ్చు. ఉండలేని వారు పండ్లు, పాలు, పండ్ల రసాలు వంటివి తీసుకోవచ్చు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేస్తే శివసాయుజ్యాన్ని పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది. శాస్త్రీయపరంగా కూడా ఉపవాసం మంచిదే. మనం తీసుకున్న ఆహారం జీర్ణమవ్వాలంటే జీర్ణ వ్యవస్థ చాలా శ్రమించాలట. అందుకే మన జీర్ణ వ్యవస్థకు వారానికోసారి విశ్రాంతి ఇవ్వాలి. దీంతో అది పుంజుకుని ఎలాంటి రుగ్మతలు దరి చేరకుండా చూస్తుంది. ఉపవాసం శరీరానికే కాకుండా మనసుకి కూడా ప్రశాంతతను ఇస్తుంది.
