ఒంటిమిట్ట ఆలయ చరిత్ర ఏంటంటే..

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించాడు. సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తుండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయింది. సీతాన్వేషణ కోసం జాంబవంతుడు సహకరించాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడు.

శాసనాల ప్రకారం :

ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారని, 14వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో పూర్తయిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఉదయగిరిని పాలించిన కంపరాయలు ఈ ప్రాంతంలో ఒకసారి సంచరిస్తాడు. వేట మీద జీవనం సాగించే వంటడు, మిట్టడు ఇక్కడికొచ్చిన కంపరాయలకు, ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీరుస్తారు. వీరిరువురి కోరికపై కంపరాయలు ఆలయాన్ని నిర్మించి ఒంటిమిట్ట గ్రామాన్ని ఏర్పాటుచేస్తాడు. క్రీ.శ 1356లో బుక్కరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత కాలంలో విజయనగరరాజులు, మట్లిరాజులు క్రమంగా గుడికి అంతరాళం, రంగమంటపం, మహాప్రాంగణం, గోపురం, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుపక్కల గ్రామాల రాబడిని ఆలయ కైంకర్యాలకు వినియోగించారు. వావిలికొలను సుబ్బారావు భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు.

Share this post with your friends