
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 7.30 నుంచి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే స్వామివారికి వివిధ కార్యక్రమాలను ఉదయం, సాయంత్రం ఆలయ అధికారులు నిర్వహించున్నారు. ముఖ్యంగా మే 8న రాత్రి 7 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వమించనున్నారు. దీనిలో దంపతులు ఎవరైనా రూ.500 చెల్లించి పాల్గొనవచ్చు.
అయితే శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వర స్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా బాణపట్టమును అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
