‘భాద్రపద శుద్ధ చవితి’ రోజున మనం వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున వినాయకుడు జన్మించాడని కొందరు… గణాధిపత్యం వచ్చిందని కొందరు చెబుతారు. ఏదైతేనేమి మనమైతే వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించుకుని పది రోజుల పాటు పూజించుకుంటూ ఉంటాం. వినాయక చవితి రోజున అసలు మనం ఏం చేయాలి? వినాయక చవితికి కావల్సిన పూజా సామగ్రి ఏంటో తెులసుకుందాం. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత శుద్ధిగా స్నానం చేసి మంచి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆపై ఇంటికి మామిడి తోరణాలు కట్టడం.. ఇంటిని చక్కగా అలంకరించుకోవడం వంటివి చేయాలి.
ముందుగా పూజ కోసం కావల్సిన సామాగ్రి వచ్చేసి.. పసుపు, కుంకుమ, తమలపాకులు, కర్పూరం, అగరబత్తీ, కొబ్బరికాయలు, పువ్వులైతే తప్పక మనం తెచ్చి పెట్టుకుంటాం. వీటితో పాటు వినాయకుడి పూజకు తోరం, కందులు, నెయ్యి, వత్తులు, పాలవెల్లి, 21 రకాల పత్రి, ఉద్దరణి కూడా తప్పక కావల్సి ఉంటుంది. ఇక నైవేద్యాలను ఎలాగూ సిద్ధం చేసుకుంటాం. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ముందుగా పెట్టుకోవాలి. ఆపై పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టి.. అగరువత్తులు వెలిగించి, దీపారాధన చేయాలి. పీటపై వినాయకుడిని ప్రతిష్టించి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి విగ్రహం పైభాగంలో వేలాడదీయాలి. పాలవెల్లిని నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పండ్లతో అలంకరించాలి. ఇక రాగి లేదా ఇత్తడి పాత్రను నీళ్లతో నింపి దానికి పసుపు రాసి.. పైన టెంకాయ, జాకెట్టుతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఇక గణపతి పూజను ఆరంభించడానికి అంతా సిద్ధమైపోయినట్టే.