హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకున్న మీదట రావణ దహనం చేస్తారు. రావణుడి దిష్టి బొమ్మను తయారు చేసి దానిని దహనం చేస్తారు. ఇది కూడా ఒక పెద్ద కార్యక్రమంలా చేస్తారు. అయితే రావణుడి గురించి మనకు తెలియని చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. రావణుడి అసలు పేరు మరొకటి ఉంది. అలాగే రావణుడికి, కుబేరుడికి సైతం సంబంధం ఉంది.. అదేంటి? వంటి ఎన్నో విషయాలు మనకు తెలియవు కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం.
రావణాసురుడికి జ్ఞాన సంపద అపారం. వాస్తవానికి రావణుడు సగం మాత్రమే రాక్షసుడు. మిగిలిన సగం బ్రాహ్మణుడు. రావణుడి అసలు పేరు దశగ్రీవుడు. దశగ్రీవుడు అంటే అర్థం పది తలలు ఉన్నావాడు అని. అసలు రావణుడు ఎవరు పుత్రుడో తెలుసా? బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వశ్రవుడికి ఇద్దరు భార్యలు. వరవర్థిని, దైత్య రాకుమారి కైకసి. ఈ కైకసి కుమారుడే రావణుడు. ఇంకా ఆమెకు కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు జన్మించారు. మరి రావణుడికి కుబేరుడికి సంబంధమేంటి అంటారా? విశ్వశ్రవుడి మొదటి భార్య వరవర్థినికి పుట్టిన కుమారుడే సంపదకు అధిపతి అయిన కుబేరుడు. అలా చూస్తే రావణుడు, కుబేరుడు ఇద్దరూ సోదరులన్నమాట.